ఆదిపురుష్ టీజర్ రిలీజ్… అభిరాముడిగా ప్రభాస్ లుక్స్ అదుర్స్

-

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఆదివారం ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను అయోధ్య వేదికగా విడుదల చేశారు. 1.40 నిమిషాల టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. టీజర్‌లో కనిపించిన విజువల్స్‌ చూస్తుంటే సినిమాను అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

రామసేతుపై రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ వచ్చిన సీన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ క్రూరత్వం, రాక్షసులను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. సీత పాత్రలో నటించిన కృతిసనన్‌తో పూల తోటలో ఊయలలూగే షాట్ కలర్ పుల్‌గా ఉంది. హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ అదరగొట్టారు. సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌ నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత వన్నె తెచ్చింది.

‘అధర్మం, అన్యాయం పదితలలుగా విలసిల్లుతున్న సమాజంలో న్యాయం రెండు పాదాలతో నడుచుకుంటూ(రాముడు) రూపంలో అధర్మాన్ని సంహరిస్తుంది’ అని డైరెక్టర్ ఓంరౌత్ ‘ఆదిపురుష్’ రూపంలో చెప్పబోతున్నట్లు అర్థమవుతోంది. ‘ఆదిపురుష్’లో రామ-రావణ యుద్ధం ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. హాలీవుడ్ స్థాయి సినిమా లక్షణాలు ‘ఆదిపురుష్’లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ‘ఆది పురుష్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీత, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్.. ప్రతినాయకుడు రావణాసురుడిగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్​-రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ బడ్జెట్‌, రిలీజ్‌పై కొన్ని ఆసక్తికర విశేషాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లని సమాచారం.

దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘ఆదిపురుష్‌’ని పాన్‌ ఇండియా మూవీగా కాకుండా పాన్‌ వరల్డ్‌ మూవీగా పిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news