ఎందుకు ఒకరినొకరు అభినందించుకోవడంలేదు : ప్రకాశ్‌ రాజ్‌

-

టాలీవుడ్‌లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన క్షణాలు అని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. కానీ, ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రారెందుకని ఆయన ప్రశ్నించారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ తదితరులు జాతీయ పురస్కారం అందుకున్న వేళ తెలుగు కళామతల్లి మురిసిపోయింది. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు వాళ్లు గర్వించదగ్గ క్షణాలు అని అభివర్ణించారు. అయితే, ఇలాంటి సంబరాలకు ఇండస్ట్రీలో అందరూ కలిసి రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పార్టీలో యువ దర్శకులు కనిపిస్తున్నారు కానీ, పెద్దవాళ్లు రాలేదని విమర్శించారు.

ఒకప్పుడు తాను అంతఃపురం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నానని, అప్పుడు ఇలాంటి సంబరాలు జరిపే వాళ్లు లేరని, కానీ ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ ఇలాంటి వేడుక జరపడం అభినందనీయమని తెలిపారు. ఇవాళ తనకు చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే ముందు నాలో ఉన్న బాధను చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారంటే తెలుగులో ఉన్న అందరు నటులు గర్వించాల్సిన అంశం అది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లాడంటే తెలుగు వాళ్లు గర్వించాల్సిన అంశం అది. దేవి శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు గెలుచుకున్నాడంటే తెలుగు వాళ్లకు గర్వకారణం అది. అలాంటప్పుడు అందరూ ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదు, ఎందుకు ఒకరినొకరు అభినందించుకోవడంలేదు?” అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version