మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం జరిగింది. రాజకీయాలకు తాను పనికి రాను అంటూ ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనతో పాటుగా 36 మంది కొత్త మంత్రులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల నుంచి పలువురికి మంత్రి పదవులు లభించగా ఆశించిన వారికీ మాత్రం దక్కలేదు.
ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని బీద్ జిల్లా మజల్‌గాన్ అనే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసన సభకు ఎన్నికైన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మంగళవారం తాను రాజీనామా చేస్తున్నాను అని, మంత్రి వర్గ విస్తరణ తర్వాత తాను రాజకీయాలకు పనికి రాను అనే విషయం స్పష్టమైందని, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా అంటూ, తనకు ఎన్సీపీలో ఏ ఒక్క నాయకుడితో తనకు విభేదాలు లేవని,
మంత్రి పదవి రాలేదు అనే కారణంతో మాత్రం తాను రాజీనామా చేయడం లేదని ఆయన స్పష్టం చేసారు. తాను తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ అగ్ర నేతలకు తాను చెప్పినట్టు వివరించారు. ముంబైలో స్పీకర్ ని కలిసి రాజీనామా చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు గానూ ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ చాలా కీలకంగా ఉంది. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.