ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్థానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్ ఏర్పాట్లు చేశారు.
బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కృష్ణలంక, భూపేష్ గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
మరోవైపు.. శ్రీశైలం జలశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 213.40 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 46,123 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.