గర్భిణీలకు కరోనా వ్యాక్సిన్.. వేయించుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.

-

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన ప్రకారం, గర్భిణీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు, గర్భం దాల్చారో లేదో అనుమానంగా ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పింది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. దానికి కారణం మే 28న జరిగిన జాతీయ సాంకేతిక సలహా సమూహ సమావేశమే. గర్భిణీలు కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుంటుందని అందులో నిర్ణయించారు.

కరోనా సోకే ప్రమాదం ప్రతీ ఒక్కరికీ ఉన్న నేపథ్యంలో వారు కూడా వ్యాక్సిన్ వేసుకుంటే ఏదైనా ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చని వాళ్ళు తెలిపారు.

గర్భిణీలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అంతవరకూ ఓకే. కానీ వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి? వంటి సందేహాలు మీకు కలుగుతున్నాయా? ఐతే ఇది మీకోసమే.

ముందుగా గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటే ఈ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోవాలి.

వ్యాక్సిన్ కారణంగా దీర్ఘకాలంలో పిండానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అన్న విషయం ఇంకా తెలుసుకోలేరు.

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దాదాపు 30నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అది వ్యాక్సిన్ నియమాలలో ఒకటి. గర్భిణీలు ఖచ్చితంగా అది పాటించాలి.

ఇంకా, కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా వారి గైనకాలజిస్టుని సంప్రదించాలి. వైద్యుడితో సంప్రదించి, విషయం వివరించిన తర్వాత మాత్రమే డోసు తీసుకోవాలి. వైద్యుడిని సంప్రదించకుండా స్వయంగా నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.

ఐతే వైద్యులు కూడా గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇతర అనుబంధ వ్యాధులున్న వారికి ఇది మరీ ముఖ్యం అంటున్నారు. ఏది ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపులా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news