తాను ఆకలిని చంపుకుని చదువుకున్నాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో తాను విద్యనభ్యసించిన రమాదేవి వర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం పాల్గొని ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. నాలుగు దశాబ్దాల క్రితం.. రమాదేవి విశ్వవిద్యాలయంలో ఎలాంటి సౌకర్యాలూ లేవని, నిమ్మరసం తాగి, తోపుడు బండి వద్ద పావలా పెట్టి కొనుక్కున్న పల్లీలు తిని విద్యార్థులు ఆకలి తీర్చుకునేవారని ముర్ము చెప్పారు.
మయూర్‌భంజ్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్ చేరుకున్న తాను పేదరికం వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. వేరుశనక్కాయలు తినాలని ఉన్నా.. పావలా మిగులుతుందని ఆకలిని చంపుకొని గడిపిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయన్నారు. మహిళలు.. పురుషులతో సమానంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం సంతోషకరమన్నారు.
తన జీవితం ఎత్తుపల్లాల సమ్మేళనమని, శారీరక, మానసిక రుగ్మతలకు లోనై చాలా బాధ పడ్డానని రాష్ట్రపతి పేర్కొన్నారు. యోగా, ప్రాణాయామం, ఆధ్యాత్మిక పథంవైపు ప్రయాణం సాగించిన తరువాత వాటన్నింటినీ జయించానని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొంది, ఆత్మస్థైర్యంతో ఇక్కడి వరకు వచ్చానన్నారు.