తెలంగాణ రాష్ట్రంలో బలపడటమే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు తెలంగాణపై బిజెపి ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బిజెపి జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోడీతో కమలం కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్పొరేటర్ల తో మోడీ భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు మోదీ దిశానిర్దేశం చేయనున్నాట్టు సమాచారం. అలాగే మోదీని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు సైతం కలవనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కమలం కార్పొరేటర్లు మంగళవారం సాయంత్రం హస్తిన బాట పట్టనున్నారు.వాస్తవానికి ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ లోని ఐఎస్బి వార్షికోత్సవానికి వచ్చినప్పుడే పార్టీ కార్పొరేటర్లను కలిసి చర్చించాలని భావించారు.
అప్పుడు కుదరకపోవడంతో ఆ సమావేశము రద్దయింది. దీంతో కార్పొరేటర్లు నిరాశ చెందారు. ఈ క్రమంలోనే పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎవరు నిరాశ చెందవద్దని, త్వరలోనే ప్రధాని మోదీతో భేటీ అవుదామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. కానీ ఇంత త్వరగా కలుస్తామని తాము కూడా ఊహించలేదని కొందరు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.