నాగాలాండ్ జైలు నుంచి తొమ్మిది మంది ఖైదీలు తప్పించుకున్నారు. కారాగారం నుంచి తప్పించుకున్న వారిలో అండర్ ట్రయల్ ఖైదీలు, హత్యానేరం కింద జైలుకు వచ్చిన వారు ఉన్నారు. సెల్ తాళంచెవిని దొంగిలించిన వీరు శనివారం తెల్లవారుజామున జైలు నుంచి పారిపోయినట్లు అధికారులు తాజాగా ధ్రువీకరించారు. ఖైదీలను గుర్తించేందుకు పోలీసులు, జైలు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మోన్ జిల్లా జైలు నుంచి కనీసం తొమ్మిది మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి సోమ పోలీస్ స్టేషన్‌లో జైలు అధికారులు కేసు నమోదు చేశారు. పారిపోయిన వారిని తిరిగి పట్టుకునేందుకు వివిధ ఏజెన్సీల సహకారం తీసుకుంటున్న పోలీసులు.. లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. పరారీలో ఉన్న ఈ ఖైదీలకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తే పోలీసులను సంప్రదించాలని ఖైదీల సొంతూళ్ల గ్రామ సభలకు అధికారులు సూచించారు.