తెలంగాణలో కాంగ్రెస్ పూర్వవైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్తోంది. పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో మమేకమై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఆయుధంగా మలుచుకుని వాటిపైనే స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై సమరభేరీ మోగించేందుకు రెడీ అయింది.
టీఎస్పీఎస్సీ, పది పరీక్షల పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ తన యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసమే విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. అదే విధంగా మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుండడంతో… అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.