రాష్ట్రంలో సాగు, తాగు నీటి కష్టాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. విద్యుత్ కోతలతో పాటు సాగు నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని, మరోవైపు తాగు నీరు కూడా ఈ సర్కార్ అందించలేకపోతున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యలపై ‘ఎక్స్’ వేదికగా ఆమె ప్రశ్నించారు.
ఆలేరు, భువనగిరి, జనగామ సెగ్మెంట్లలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు,ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించినట్లు గుర్తుచేశారు.విద్యుత్ సమస్య ఉండొద్దని నల్గొండలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగు నీటిని కూడా అందించలేని అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఉందని.. కేవలం కమీషన్ల మీదే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. సమ్మక్క- సారలమ్మ ప్రాజెక్టును 95శాతం పూర్తి చేయగా, పెండింగ్ 5 శాతం పనులను ఈ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.