- రైతన్నలు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా?
- మోడీ సర్కారు, ఎన్ఐఏ తీరుపై పంజాబ్ సీఎం ఆగ్రహం
న్యూఢిల్లీః కేంద్ర ఇటీవల తీసుకువచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తున్న ఆందోళనలు దేశరాజధాని సరిహద్దులో కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఒక వైపు రైతులతో చర్చలు జరుపుతూనే మరో వైపు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. వివాదాస్పద మవుతున్న మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అన్నదాతలు.. ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా మీకు అంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పలువురు అధికార పార్టీ నేతలు… కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నది రైతులు కాదంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలువురు రైతన్నలతో పాటు మీడియా, పాత్రికేయులకు సమన్లు జారీ చేసింది. దీనిపై అమరీందర్ సంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఉగ్రవాదులా? లేక వేర్పాటువాదులా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ సర్కారు రైతులను అణచివేసే చర్యలకు పాల్పడుతోందిని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే అణచివేత చర్యలు.. న్యాయమైన రైతుల హక్కులను అడ్డుకోలేవనీ, దీని వల్ల రైతన్నల ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చిరించారు.
కేంద్రం ఇలా ప్రవర్తించడం రైతులను రెచ్చగొట్టినట్టే అవుతుందన్నారు. ఆ చట్టాల ద్వారా ప్రేరేపించబడిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను, వారికి మద్దతుగా నిలిచినవారిని భయాందోళనకు గురిచేస్తూ.. వేధింపులకు పాల్పడటం తగదని అన్నారు. ఆప్ నేతలు సైతం రైతులకు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఆప్ నేత భగవాన్ మాన్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఓ వైపు రైతులతో చర్చలు జరుపుతూనే మరో వైపు వారిని బెదిరించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.