మద్యం దుకాణాల్లో అక్రమాలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్వర్యంలో మద్యం దుకాణాల ముట్టడి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురంలోని ఓ మద్యం దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఒకరోజులో ఇక్కడ రూ.1 లక్ష విలువైన సరుకును విక్రయిస్తే బిల్లు రూ.700కు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మద్యం దుకాణంలో ఉన్న వ్యక్తి నుంచి ఈరోజు వచ్చింది ఎంత? బిల్లులు ఇచ్చింది ఎంత? అని ఆరా తీశారు. అనంతరం మద్యం సీసాలతో నిరసన తెలిపి, వాటిని ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జగన్‌రెడ్డి పూర్తి నిషేధం విధిస్తామని చెప్పి ఇప్పుడు తుంగలో తొక్కారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.