రష్యాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ అమెరికా, జర్మనీలనుద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. అమెరికా 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ 14 లెపర్డ్ 2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందిస్తుండటంపై మండిపడ్డారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘మేం మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదు. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయి. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నాం. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలి. జర్మనీ ట్యాంకులతో రష్యాకు ముప్పు ఉందనేది నమ్మలేని నిజం. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా చెప్పింది’ అని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.