సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులకు అనుమతలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ . కృష్ణయ్య ఘాటుగా స్పందించారు. పేద విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాల ఫలాలు అందాలంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిటల్ విధానంలో విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించాలని ప్రభుత్వం సిద్ధపడటం మంచి నిర్ణయమని ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.
అయితే మారుమూల గిరిజన గ్రామాల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లో ఇప్పటికీ లక్షలాది ఇళ్లల్లో ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ఇళ్లల్లోని పిల్లలు ఆన్ లైన్ పాఠాలు వినే అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
టీవీల ద్వారా పాఠాల బోధనలో వివరణ కోరడానికి ఎలాంటి ఆస్కారం ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీని వల్ల విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం వుందన్నారు. అందుకే విద్యార్థులకు ప్రభుత్వమే ల్యాప్ టాప్‌లు , స్మార్ట్ ఫోన్‌లు కొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తిని పెద్ద సారు పట్టించుకుంటారా?. కృష్ణయ్య డిమాండ్ సాధ్యమయ్యే పనేనా అని అంతా ప్రశ్నలు సంధిస్తున్నారు.