కొంత కాలం క్రితం నుంచి ఎంపీ రఘురామ వ్యవహారం ఏపీలో ఎంత పెద్ద వివాదంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఆయనపై ఎలాగైనా వేటు వేయాలని కోరుతూ సీఎం జగన్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కుమార్‌ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఎంపీ భరత్ కూడా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి రఘురామపై ఫిర్యాదు చేశారు. కాగా అప్పట్లో ఎంపీ మార్గానిపై ఎలాంటి స్పందన చేయని రఘురామ ఎట్టకేలకు ఇప్పుడు కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు.
అనర్హత వేటు విషయంలో లోక్‌సభ స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాలు వైసీపీ నాయకులే తీసుకుంటున్నట్లు తనకు ఇంత వరకు తెలియదని ఎంపీ రఘురామ ఎద్దేవా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజమండ్రి ఎంపీ భరత్ కుమార్ నటించిన ఓ మూవీ ప్లాప్ అయిందని, ఒకవేళ ఆ సినిమా గనక హిట్ అయి ఉంటే మనం చాలా మంచి నాయకుడిని మిస్ అయ్యేవాళ్లం అంటూ ఎద్దేవా చేశారు.
తన విషయంలో ఎలాగైనా అనర్హత వేటు వేయించేందుకు లోక్‌సభను స్తంభింపజేస్తామని గొప్పలకు పోతున్న మార్గాని భరత్ కుమార్ అదే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ, రైల్వే జోన్ కేటాయింపు లాంటి విషయాలపై ఎందుకు స్పందించట్లేదని ఎంపీ రఘురామ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అడియాశలుగా మిగిలిపోతాయని రఘురామ ఎద్దేవా చేశారు. మొత్తానికి ఇప్పటి దాకా సీఎం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసిన రఘురామ ఇప్పుడు పార్టీనేతలను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారన్నమాట.