పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి జరిగే ఎన్నికల్లో తాను కూడా నామినేషన్ దాఖలు చేశానని, మా పార్టీ నుంచి ఇద్దరు పేర్లను ప్రతిపాదించారని, ఎన్నిక అంటూ జరిగితే తాను అవలీలగా విజయం సాధిస్తానని, వివిధ రాజకీయ పక్షాలతో పాటు, బీజేపీలోనూ ఎంతో మంది ఎంపీలతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, పిఎసి, పియుసి కమిటీలకు గత రెండేళ్లుగా నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తున్నానని చెప్పారు.
అయితే చివరి నిమిషంలో పీ ఏ సీ కమిటీ కోసం దాఖలు చేసిన తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా తమ పార్టీ నాయకత్వం లేఖ రాసిందని తెలిపారు. ఒకవైపు తనని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాళ్ల చెప్పులరిగేలా తిరిగి, సూట్ కేసులతో యుద్ధం చేసి… ఇప్పుడు వారే తనని మా పార్టీ సభ్యుడు అని పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు. పార్టీలో ఉంచుకుంటే ఉంచుకో, పీక్కుంటే పీక్కో.. దమ్ముంటే పీక్కో అని సోషల్ మీడియాలో అంటున్నారని, కానీ నేను ఆ మాట అననని, సింహాన్ని అని చెప్పుకునే మీకు ఈ తరహా చిల్లర రాజకీయాలు తగదని పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు.