తెలంగాణ రాష్ర్టంలో రాజకీయాలు ప్రస్తుతం మంచి వేడి మీదున్నాయి. అన్ని పార్టీలు కొత్త జోష్ మీద రాజకీయాలు చేస్తున్నాయి. ఇక టీఆర్ ఎస్ ను మించికాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పార్టీలు దూకుడు మీదున్నాయి. వరుస సభలు, సమావేశాలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీలో మంచి హుషారు కనిపిస్తోంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ పాదయాత్రల పేరుతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ దూకుడును మరింత పెంచేందుకు కేంద్ర పెద్దలు రంగంలోకి దిగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టి తమ పార్టీలను మరింత పటిష్టం చేసేందుకు వస్తున్నారు. కాగా కాషాయ ధళం నుంచి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డపై ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఒకేనాడు ఇద్దరూ పర్యటించనున్నారు. దీని కోసం ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక నిర్మల్ లో వెయ్యి ఊడల మర్రి చెట్టు దగ్గర బీజేపీ అమిత్ షా కోసం భారీ సభ ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ సభకు కోసం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంజయ్ ప్రస్తుతం తాను చేస్తున్న పాదయాత్రను ఆపేసి మరీ అందులో పాల్గొంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా వరంగల్ లో దళిత, గిరిజన దండోరా సభల్లో భాగంగా ఇక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో పట్టు పెంచుకునేందుకు రాహుల్ గాంధీని రప్పిస్తున్నారు. ఈ సభలో ఆయన పాల్గొంటారని మాణిక్కం ఠాకూర్ చెప్పారు. ఈ సభలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పునరుత్తేజం తీసుకురావాలని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు.