మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి అనర్హత వేటు వేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన రాహుల్ అదానీ గురించి ప్రశ్నించినందుకు తనకు ఏం జరిగిందో ప్రజలంతా చూశారని అన్నారు.
సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. అదానీపై ప్రశ్నించినందుకే బీజేపీ ఇలా చేసిందని ఆరోపించారు. అయినా సరే తాను ప్రశ్నించడం ఆపనని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై తాను పోరాడతానని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా తాను వెనకడుగు వేయనని పునరుద్ఘాటించారు.
“అదానీకీ, మోదీకి మధ్య స్నేహబంధం ఉంది. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచి వారి మధ్య అనుబంధం ఉంది. అదానీ షెల్ కంపెనీల్లో 20వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ నేను లోక్ సభ స్పీకర్ కు సమర్పించాను. అదానీ వ్యవహారం పక్కదారి పట్టించేందుకే నాపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపించినా నేను ప్రశ్నించడం ఆపను. బీజేపీని చూసి నేను భయపడను.. ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా” అని రాహుల్ గాంధీ చెప్పారు.