నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కలసి కట్టుగా ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గత 3 వారాలుగా ఇంధన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలన్నారు. ఇందుకు గాను ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపించాలన్నారు.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ప్రజలు సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌లో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. #SpeakUpAgainstFuelHike అనే క్యాంపెయిన్‌లో అందరూ పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించాలన్నారు. దాంతోనైనా చెవుడు కారణంగా పూడుకుపోయిన కేంద్రం ప్రభుత్వం చెవులు తెరుచుకుంటాయని అన్నారు. ఈ క్రమంలోనే రాహుల్.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కేంద్రంపై చేసిన ఆరోపణల వీడియోను షేర్ చేశారు.
आइये #SpeakUpAgainstFuelHike campaign से जुड़ें। pic.twitter.com/oh8AEfqM3y
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2020
కేంద్రం ప్రజల గాయాలపై ఉప్పు చల్లి వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఓ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు లేక, ఉన్నా జీతాలు రాక, ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సరికాదని అన్నాడు. కేంద్రం ఇంధన ధరలను పెంచుతూ ప్రజల డబ్బును దోచుకుంటుందని ఆరోపించాడు.
కాగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. జూన్ 30 నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలను నిర్వహించనుంది. ఈ క్రమంలోనే సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక జూన్ 30 నుంచి 5 రోజుల పాటు ఆ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది.