తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుశాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, ఉప్పల్, హయత్‌నగర్, ఆటోనగర్, నాగోల్, బీఎన్‌రెడ్డి, తుర్కయంజాల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంది. కాగా, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విదర్భ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరించి ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 7 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది వాతావరణ శాఖ.