హైదరాబాద్: జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. సముద్ర మట్టానికి 8.9 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇవాళ, రేపు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అటు ఏపీలో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. సముద్ర తీరం ప్రాంతంలో అలెర్ట్ ప్రకటించారు. సముద్రంలోకి మత్య్సకార వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద ఉండొద్దని తెలిపారు.
ఏరువాకలో భాగంగా రైతులు పొలాలు వేస్తున్నారు. ఇప్పటికే రైతులు పొలం దున్ని పంటలు వేస్తున్నారు. అయితే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశాయానికి వరద పెరుగుతోంది.ఇన్ ఫ్లో 25,589 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12,713 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 817.60 అడుగులుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.