తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది.
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల స్వల్ప వర్షం కురిసింది. అత్యధికంగా జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో 5.1 సెంటీమీటర్ల వర్షం కురుసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 4.1 సెం.మీటర్లు, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో 3.9, సంగారెడ్డి జిల్లా నాయికల్‌లో 3.8, మెదక్ జిల్లా రామాయంపేటలో 3.6, వరంగల్ జిల్లా గీసుకొండలో 3.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణకేంద్రం అధికారులు వెల్లడించారు.