తెలంగాణ రాష్ట్రంలో వానలు ఆగడం లేదు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని మోస్తురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో అక్కడకడ్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో మరికొన్ని జిల్లాలో వర్షాలు పడుతాయని అంచనా వేసింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.