ఆ ఎమ్మెల్యే ఉన్నా లేనట్టేనా..సిక్కోలులో ఆసక్తికర చర్చ…!

-

సైకిల్ స్పీడు నడిచిన సమయంలోనూ ఆయన అక్కడ గెలిచి నిలిచారు . మళ్లీ ఐదేళ్లకు ఫ్యాన్ గాలి వీచినప్పుడూ ఆయనే సిట్టింగ్ నేతగా విజయం సాధించారు . కానీ ఏం లాభం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహారం ఎలా ఉందో… అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉందట . మనిషి మంచోడే కదా అని బోల్డంత నమ్మకం పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించుకున్న జనం ఇప్పుడు ఏం అడిగినా … నానేటి సేయలేను అంటున్నారట . నాను పేరుకే ఎమ్మెల్యేని … మీకేం కావాలన్నా ఆళ్లనే అడగండంటున్నారట . దీంతో ఇప్పుడు అందరూ ఆయన ఉన్నా లేనట్లే అంటూ గుసగుసలాడుకుంటున్నారట .

సిక్కోలు లో వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ రాజాం నియోజకవర్గం . ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈప్రాంతంలో దశాబ్ధకాలంగా తమ్ముళ్ల తన్నులాటలు ..లోకల్ పాలిటిక్స్ పెరిగిపోవడంతో…. ప్రత్యర్ధి పార్టీకి మేలు జరిగింది . ఈక్రమంలో రాజాంలో 2014 ,2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ జెండా ఎగరేసింది . 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రాజాం స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది . వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులు ఎమ్మెల్యేగా గెలిచారు . ఆ తర్వాత మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ గాలి ఇక్కడ బాగా వీయడంతో భారీ మెజార్టీతో జోగులు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు . ఐతే ఇంత వరకూ బాగానే ఉంది కానీ … గత ఐదేళ్లలో పాడిన పాటే ఇప్పుడూ జోగులు పాడుతుండటంతో అటు కార్యకర్తలు , ఇటు నియోజకవర్గ ప్రజలకు ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదట .

2014 ఎన్నికల సమయంలో తాను గెలిస్తే రాజాం నగర పంచాయితీలో రోడ్ల విస్తరణ, బొబ్బిలి సెంటర్ వద్ద ఉన్న ఎర్రచెరువును అభివృద్ది చేసి పార్కు క్రింద తయారు చేయడం, రాజాం నియోజకవర్గ కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు, తోటపల్లి,నారాయణపురం క్రింద ఉన్న భూములకు సాగునీరు, బలసలరేవు వద్ద వంతెన, మడ్డువలస రిజర్వాయర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితా ఇలా బోల్డన్ని ఎమ్మెల్యే అభ్యర్ధిగా కంబాల జోగులు హామీలు ఇచ్చారు . ఐతే అప్పటి ఎన్నికల బరిలో టీడీపీ తరపున ప్రతిభాభారతి , కాంగ్రెస్ తరపున కోండ్రుమురళి , వైసీపీ తరపున కంబాల జోగులు బరిలో నిలిచారు . వీరిలో కోండ్రుమురళీకి వ్యక్తిగతంగానూ , రాజాం నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గెలిచి బోల్డంత అభివృద్ది చేశారన్న గుర్తింపు ఉంది . కానీ ఆ ఎన్నికల్లో విభజన ఎఫెక్ట్ తో కోండ్రు , లోకల్ పాలిటిక్స్ కారణంగా ప్రతిభా భారతి దెబ్బైపోవడంతో విజయం కంబాల జోగులుని వరించింది .

రాజాంలో కంబాల గెలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి టీడీపీ రావడంతో జోగులు విజయంసాధించి ప్రతిపక్షానికి పరిమితమైపోయారు . దీంతో గడచిన ఐదేళ్లు తన వద్దకు ఎవరు ఏచిన్న పనిమీద వచ్చినా…. నేను ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేని….నా చేతుల్లో ఏమీ లేదు…ప్రభుత్వం నాకు నిధులు ఇవ్వడం లేదు …ఇదే మాట చెప్పుకొస్తూ జనం దగ్గరా , కార్యకర్తల దగ్గరా సానుభూతి కొట్టేశారు . తాను ఎమ్మెల్యేనే అయినప్పటికీ అంతా టీడీపీ నేతలు , జన్మభూమి కార్యకర్తల హవా నడుస్తుందని…నన్నేం చేయమంటారు…నేనేం చేయలేను అంటూ చేతులెత్తేసిన కంబాల పై నియోజకవర్గ ప్రజలు కూడా జాలి చూపేవారట . ఐతే ఇంతవరకూ బాగానే ఉంది కానీ ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగులు తీరులో మార్పురాకపోవడం పై నే నియోజకవర్గంలో జోరుగా చర్చనడుస్తోందట .

సౌమ్యుడిగా పేరున్న కంబాలకే 2019లోనూ రాజాం ప్రజలు పట్టం కట్టారు . గతంలో టీడీపీ ప్రభుత్వం వల్ల తానేమీ చేయలేకపోయానని ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన ఒకే ఒక్కమాటకు , రాజాంలో టీడీపీ గ్రూప్ పాలిట్రిక్స్ తోడవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కంబాల ఎలక్షన్స్ బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు . ఐతే ఈసారి ఇటు జిల్లా అటు రాష్ట్రం అంతా ఫ్యాన్ సునామీ సృష్టించడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది . వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధినేత అయ్యారు . దీంతో రాజాం ప్రజలు ఇక తమ కష్టాలు తీరిపోయినట్లేనని భావించారు . కానీ ప్రస్తుత పరిస్థితిని తలచుకుని నియోజకవర్గ జనం భారంగా నిట్టూరుస్తున్నారట . రాజాంలో ఏ ఇద్దరు కలిసినా, ఏ ముగ్గురూ చర్చించుకున్నా అంతా రోడ్ల విస్తరణ గురించే . ఎప్పుడో చంద్రబాబు హయాంలో మొదలెట్టిన పనులు ఇప్పటికీ అక్కడే ఉన్నాయట . కంబాల రెండోసారి గెలిచాడు మా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయనుకుని ఆశపడిన జనానికి నిరాశే మిగిలిందట . ఇలా కేవలం రోడ్లే కాదు…అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈసారి మోక్షం కలుగుతుందని అందరూ భావించారు . కానీ ఎక్కడా అడుగు కూడా ముందుకు పడకపోవడంతో … గతంలో సరే ఏడాదిన్నరైంది ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ అని జనం భూతద్దం పెట్టుకుని మరీ వెతుకుతున్నారట .

కానీ ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రారంభించడానికే పరిమితమైపోతున్నారట . పోనీ ఎవరైనా వెళ్లి సారూ కొంచె దయచూపండి ..ఫలానా పనిచేసిపెట్టండని వేడుకుంటున్నా…నేనేం చేయను…. అంతా పెద్దాయన చేతుల్లో ఉందంటూ పార్టీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం పేరు చెబుతున్నారట . ఐతే రాజశేఖరం లేదా ఆయన కుమారుడు డీసీసీబీ ఛైర్మన్ పాలవలస విక్రాంత్ ని అడగండని తనవద్దకు వచ్చే వారికి ఉచిత సలహాలిస్తున్నారట . గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి సహకరించడం లేదంటూ అందరి దగ్గరా సానుభూతిని సంపాదించిన కంబాల…ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా…పార్టీ అధికారంలో ఉన్నా…తానేమీ చేయలేనంటూ చేతులెత్తేయడం చూసి నియోజకవర్గ ప్రజలతో పాటు కార్యకర్తలకు కూడా నోటమాటరావడం లేదట . దీంతో ఎమ్మెల్యేనే ఇలా అంటుంటే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట . గడచిన ఏడాదిన్నర కాలంగా కంబాల జోగులు తీరు ఇదే విధంగా ఉండటంతో ఆయన ఉన్నా లేనట్లే అని జనం గుసగుసలాడుకుంటున్నారట .

Read more RELATED
Recommended to you

Latest news