కేంద్రంతో చర్చల కోసం రైతు సంఘాల కమిటీ ఏర్పాటు..

రైతు ఉద్యమంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తూ పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు. అయితే రైతులు మాత్రం తమకు మద్దతు ధరపై హామీ వచ్చే వరకు నిరసనలను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల మద్దతు ధరపై సంప్రదింపులు జరుపుతుందని కేంద్రం తెలిపింది.

రైతుల సమస్యలు, మద్దతు ధర విషయంలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు 5గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ కమిటీలో సభ్యులను ప్రకటించారు. కమిటీలో బల్బీర్ సింగ్ రాజేవాల్, శివ కుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చారుణి, యుధ్వీర్ సింగ్ , అశోక్ ధావలే సభ్యులుగా ఉంటారని రాకేష్ టికాయత్ తెలిపారు. కేంద్రంతో సంప్రదింపులు చేయడానికి ఇది అత్యున్నత కమిటీ అని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

మరోవైపు రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోని పక్షంలో తాము వెనక్కి వెళ్లబోమని అన్ని రైతు సంఘాల నాయకులు అన్నారు. రైతులపై ఉన్న అన్ని కేసులను వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళనను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఈరోజు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపామని రైతు నాయకుడు దర్శన్ పాల్ సింగ్ అన్నారు.