రామారావు అనే పేరు స్ఫూర్తిదాయకమని, అందుకే తాను తాజాగా దర్శకత్వం వహించిన సినిమాకి ఆ టైటిల్ పెట్టానని శరత్ మండవ తెలిపారు. రవితేజ హీరోగా రూపొందిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా దర్శకుడీయన. వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 29న విడుదల కానుంది.
“రామారావు అనేది చాలా పవర్‌ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ సర్వేలో ‘నంబరు వన్ తెలుగు పర్సనాలిటీ’గా నందమూరి తారక రామారావు నిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. ఇదే పేరున్న కేటీఆర్ గొప్ప నాయకుడు. ఇలా ‘రామారావు’ అనే పేరు స్ఫూర్తి నింపుతుంటుంది. అందుకే ఇందులోని కథానాయకుడి పాత్రకు రామారావు అనే పేరు పెట్టా. అదే టైటిల్ అయింది.” అని శరత్ అన్నారు.
ఈ సినిమాలో రవితేజ ఏం డ్యూటీ చేస్తారని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ శరత్ సమాధానమిచ్చారు. ‘సాధారణంగా మిస్సింగ్ కేసులను పోలీసులు, క్రైమ్ డిపార్ట్‌మెంట్ వారు ఛేదిస్తారు. ఇందులో ప్రభుత్వాధికారి అయిన రవితేజ మిస్సింగ్ కేసును డీల్ చేస్తారు. అది ఎందుకనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ హీరోగా పేరొందిన రవితేజ నటించిన ‘లార్జన్ దేన్ లైఫ్’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’.’ అని శరత్ తెలిపారు.