‘అపరిచితుడు’కి బ్రేక్‌.. శంకర్‌- రణ్‌వీర్‌ భారీ స్కెచ్‌!

-

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్నియన్‌’ (అపరిచితుడు)కు రీమేక్‌గా దాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఎనౌన్స్‌ చేశారు. కానీ, ఇతర ప్రాజెక్టులతో రణ్‌వీర్‌, శంకర్‌ బిజీగా ఉండటంతో ఆ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై సందిగ్ధత నెలకొంది.

ప్రస్తుతం ఆ కాంబినేషన్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. తాము ముందుగా ప్రకటించినట్టు శంకర్‌, రణ్‌వీర్‌ ‘అపరిచితుడు’ రీమేక్‌ చేయట్లేదట. తమిళ ప్రసిద్ధ నవల ‘వేల్పారి’ని ఆధారంగా చేసుకొని శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్‌. పెద్ద కథకావడంతో మూడు భాగాలుగా ఆ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులను హత్తుకునే ప్రేమకథ, మంత్రముగ్దుల్ని చేసే విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో రూపొందించేందుకు రంగం చేస్తున్నారని, వచ్చే ఏడాదిలో ఆ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్తారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

విక్రమ్‌ హీరోగా 2005లో శంకర్‌ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నే హిందీలో తెరకెక్కించనున్నట్టు 2021 ఏప్రిల్‌లో శంకర్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన.. కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్‌ 2’, రామ్‌చరణ్‌ (#RC15)తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సర్కస్‌’, ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ తదితర చిత్రాలతో రణ్‌వీర్‌ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version