కరోనా మహమ్మారి దెబ్బకి అగ్రరాజ్యం అతలాకుతలం అయిపోయింది. ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని టాక్. దీంతో ఆయన చైనాని టార్గెట్ చేస్తూ.. చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ వైరస్ ను చైనా కావాలనే సృష్టించిందని.. కాబట్టి దీన్ని చైనా వైరస్ అని పిలవాలని ఆయన చెప్పిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అయితే తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ చైనా పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ఒకవేళ చైనానే ముందుగా అభివృద్ధి చేస్తే చైనాతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ సమాధానమిచ్చారు. అమెరికాకు మంచి ఫలితం దక్కుతుందంటే ప్రపంచంలో ఎవరితోనైనా పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా పురోగతి సాధిస్తోందని, అనుకున్న సమయం కంటే ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ అన్నారు.