సీఎంలు వ్య‌తిరేకిస్తున్నా.. మోడీ స‌క్సెస్ బాట‌.. రీజ‌న్ ఇదే..!

-

దేశ‌వ్యాప్తంగా స‌గానికి పైగా ముఖ్యమంత్రులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అదే స‌మ‌యంలో కేంద్రంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న శిరోమ‌ణి అకాలీద‌ళ్ స‌హా మ‌రోపార్టీ కూడా ఇటీవ‌ల మోడీకి రాం రాం చెప్పింది. మీతో క‌లిసి ప్ర‌యాణం చేయ‌లేమ‌ని తెగేసి చెప్పాయి. ఇక‌, బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని పార్టీలు ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు మోడీ నాయ‌క‌త్వాన్ని తీవ్రంగా దుయ్య‌బ‌డుతున్నాయి. మ‌రి ఇంత వ్య‌తిరేక‌త‌లోనూ మోడీ స‌క్సెస్ ఎలా సాధిస్తున్నారు. ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఎలా సాధిస్తున్నారు ? ఇదీ ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

దీనికి కార‌ణం.. ప్ర‌పంచ ప్ర‌సిద్ధ టైమ్ మేగ‌జీన్‌.. ఇటీవల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కొనియాడుతూ.. ఆయ‌న ముఖ‌చిత్రంతో పుస్త‌కం తీసుకువ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి స‌హా.. అమెరికా స‌ర్కారుకూడా మోడీని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఆయ‌న వ్యూహ‌క‌ర్త‌, రాజ‌కీయ చాణిక్యుడు, ఆయ‌న దూర‌దృష్టి అద్భుతం అంటూ.. ఎలా ? ఎందుకు కొనియాడుతున్నాయి. ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌.. మోడీకి ఎలా సాధ్య‌మైంది ? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజ‌మే.. దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే.. అనేక రంగాల్లో తీవ్ర ఒడిదుడుకులు క‌నిపిస్తున్నాయి. మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు ప్ర‌భావం నుంచి ఇప్ప‌టికీదేశం ముందుకు సాగ‌డం లేదు.

ఇక‌, క‌రోనా నేప‌థ్యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన శైలిపై కూడా ప్ర‌జ‌ల్లోనూ ఆగ్ర‌హం ఉంది. వైర‌స్ ప్ర‌భావ‌మే లేన‌ప్పుడు ఏకంగా మూడు నెల‌ల పాటు త‌మ‌కు తిప్పులు పెట్టార‌ని,ఇప్పుడు వైర‌స్ విజృంభించిన స‌మ‌యంలో అన్నీ వ‌దిలేశారని.. దీంతో త‌మ ఉపాధులు పోయాయ‌ని ప్ర‌జ‌లు.. మోడీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర అయినా.. ఉపాధి ఊసే లేద‌ని నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, మీరు అప్పులు చేసుకోండి నేను రూపాయి కూడా ఇచ్చేది లేద‌ని మోడీ తెగేసి చెప్ప‌డంపై రాష్ట్రాలు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నాయి. ఇక‌, చైనాని క‌ట్ట‌డి చేయ‌లేక పోతున్నారు.

దాయాది దేశం పాక్ దూకుడు కు క‌ళ్లెం వేయ‌లేక పోతున్నారు. ఐక్యరాజ్య‌స‌మితిలో శాశ్వ‌త స‌భ్య‌త్వం ఊసే లేదు. ఇలా ఇన్ని వ్య‌తిరేక‌త‌లు ఉన్నా.. ఆయ‌న స‌క్సెస్‌కు కార‌ణం.. ఏంటి? అంటే.. మెస్మ‌రైజ్ చేయ‌డం, వాక్చాతుర్యం.. ఎక్క‌డ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిని చాణ‌క్య‌త వంటివి మోడీని న‌డిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజ‌మేనా? అయ‌తే, ఇది ఎన్నాళ్లు.. ? అదే ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌. మ‌రి ఈ స‌వాళ్ల నేప‌థ్యంలో భార‌త రాజ‌కీయ ముఖ‌చిత్రం మారుతుందా ?  మ‌ళ్లీ మోడికి అనుకూల‌మే అంటుందా ? అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే ఆన్స‌ర్ చేయాలి.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news