అమెరికా యుద్ధనౌకకు భారత్‌లో మరమ్మతులు

-

మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధనౌక చార్లెస్‌ డ్రూ ఆదివారం భారత్‌ చేరుకుంది. చెన్నై కాటుపల్లిలోని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన షిప్‌యార్డ్‌లో ఇది లంగరేసింది. మరమ్మతులు, ఇతర సేవల కోసం అమెరికా నౌక ఒకటి మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి.

‘భారత్‌లో తయారీ’కి ఇది పెద్ద ఊతమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొత్త కోణాన్ని జోడించిందని తెలిపింది. ఈ నౌక నిర్వహణ కోసం ఎల్‌ అండ్‌ టీ షిప్‌యార్డ్‌కు అమెరికా నౌకాదళం కాంట్రాక్టు ఇచ్చింది. చార్లెస్‌ డ్రూ యుద్ధనౌక ఇక్కడ 11 రోజులు ఉంటుంది.

ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. యుద్ధనౌకల కోసం అధిక సామర్థ్యం కలిగిన డీజిల్‌ మెరైన్‌ ఇంజిన్ల రూపకల్పనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతినిచ్చిందని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం 70 శాతం నిధులు సమకూరుస్తుందని చెప్పారు. 2-3 ఏళ్లలో 6 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన మెరైన్‌ డీజిల్‌ ఇంజిన్లను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విదేశీ నౌకలకు భారత్‌లో మరమ్మతులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news