రేవంత్ వ్యూహం…షర్మిల-ప్రవీణ్‌లని కట్టడి చేస్తుందా?

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఒకటే..2023లో తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడమే రేవంత్ తక్షణ కర్తవ్యం. అందుకే దానికి తగ్గట్టుగానే ముందస్తు వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. పీసీసీ అధ్యక్షుడైన దగ్గరనుంచి ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు అధికార టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించాలనే కసితో రేవంత్ రాజకీయం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికలు కూడా లైట్ తీసుకుని మరీ 2023 టార్గెట్‌గా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కేసిఆర్ వేసిన కొత్త ఎత్తుగడ చెక్ పెట్టేందుకు చూస్తున్నారు. దళిత బంధు పథకం పేరుతో కెసిఆర్ దళితుల ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా దళితులు, గిరిజనులు టిఆర్ఎస్‌కు పెద్దగా అనుకూలంగా ఉండరు. గత రెండు ఎన్నికల్లోనూ దళిత, గిరిజన నియోజకవర్గాల్లో టిఆర్ఎస్‌కు మంచి విజయాలు దక్కలేదు.

ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతూ వచ్చింది. ఇలా కాంగ్రెస్‌కు అండగా ఉన్న దళితులని ఆకట్టుకునేందుకు కేసీఆర్ చూస్తున్నారు. ఇక కెసిఆర్‌ని దెబ్బకొట్టి దళితులు, గిరిజనులు తమ వైపు ఉన్నారని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి దండోరా పేరుతో గిరిజన, దళితులతో  భారీ సభను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

ఇదే క్రమంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన షర్మిలకు, ఐపీఎస్ పదవిని వదులుకుని రాజకీయాలలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఒకేసారి చెక్ పెట్టాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారు కూడా దళిత, గిరిజనులని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దళిత, గిరిజన ఓట్లని ఆకర్షించడంలో వారు సక్సెస్ అయితే, కాంగ్రెస్‌కే దెబ్బ. అందుకే ఒకేసారి టీఆర్ఎస్‌తో పాటు షర్మిల, ప్రవీణ్‌లకు కూడా చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్ ముందస్తు వ్యూహాలతో వెలుతున్నట్లు కనిపిస్తోంది. మరి రేవంత్ వ్యూహం మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news