కేసీఆర్, ఈటెల రాజేందర్ మధ్య పంపకాల పంచాయతీ తోనే హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 5 ఏళ్లు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల ఏనాడు నాలుగు వేల మంది విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ గురించి గానీ, 1.91 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మందిపై వందలాది కేసులు ఉంటే కేసులు ఎత్తేయాలి అని ఎప్పుడైనా కేసీఆర్ తో కొట్లాడారా..అని ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు. 1569 మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే తెలంగాణ వచ్చింది. అలాంటి అమరవీరుల కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, వాళ్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. గతంలో రైతులు సన్నాలు వేయాలని చెప్పిన ప్రభుత్వం వారికి సున్నం పెట్టిందని, ప్రస్తుతం వరి వేస్తే ఉరే అని అంటుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్, ఈటెల పంపకాల పంచాయతీ వల్లే హుజూరాబాద్ బైపోల్- రేవంత్ రెడ్డి
-