తెలంగాణలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్యోదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది కేవలం ఓ వ్యక్తి భూ సమస్య కాదని.. దీని వెనుక చాలా పెద్ద భూభాగోతమే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ దిశగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది మామూలు సమస్య కాదని.. ఐదు వందల ఎకరాల భూ వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగిందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రొద్బలం వల్లే విజయరెడ్డి పై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి విజయరెడ్డిపై ఉందని తమకు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఇంతటి ఘోరమైన సంఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రెవెన్యూ శాఖ సీఎం దగ్గరే ఉంది.. ఘటన జరిగి 24 గంటలు అయినా సీఎం నివాళులు అర్పించేందుకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తోందని… కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపుఇవ్వడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ ఘటన పై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. భూవివాదం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు రెవెన్యూ శాఖకు మధ్య దూరం ప్రభుత్వమే పెంచిందంటున్న రేవంత్ రెడ్డి విజయరెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాకపోవడం బాధాకరమన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులందరు సీరియస్ గా తీసుకొని ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపు ఇచ్చారు. జ్యూడిషియల్ అధికారి విధినిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.