బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటు బాలీవుడ్, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ కేసు తీవ్ర దుమారం రేపుతుంది. తాజాగా.. ఇవాళ రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రికి కూడా ఈ కేసు విషయంలో సీబీఐ సమన్లు జారీ చేసింది. సుశాంత్ మాజీ అకౌంటెంట్ రజత్ మేవతిని కూడా ప్రశ్నించింది.

సుశాంత్ జీవితంలోకి రియా ఎంటర్ కాక ముందు అతని లావా దేవీలన్నింటిని రజత్ చూసేవారు. ఈ ఏడాది జనవరిలో అతన్ని రియా తొలగించినట్లు సమాచారం. కాగా ఈడీ అధికారులు కూడా మేవతిని ప్రశ్నించారు. అలాగే సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై రియాను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అవుతుందని ప్రచారం సాగుతుంది.
ఏ క్షణమైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయనుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్యనా లేక హత్య అన్నదానిపై సీబీఐ విచారణ కొనసాగిస్తుంది. ఇకపోతే రియా చక్రవర్తికిగాని ఆమె కుటుంబ సభ్యులకుగాని సీబీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమన్లు అందలేదని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సీబీఐ వారికి సమన్లు జారీ చేసినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఒకవేళ సీబీఐ సమన్లు జారీ చేస్తే దర్యాప్తు సంస్థ ఎదుట వారు హాజరవుతాయని ఆయన చెప్పారు.