తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 227.5 కోట్ల నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు గాను గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 227.5 కోట్లల్లో.. రూ. 210.44 కోట్లు గ్రామ పంచాయతీలకు, రూ. 11.37 కోట్లు మండల పరిషత్ లకు, రూ. 5.69 కోట్లు జిల్లా పరిషత్తులకు వెళ్లనున్నాయి. కాగ ప్రతి నెల తమ ప్రభుత్వం గ్రాంట్ లను విడుదల చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కాగ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడుత నిధులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు గ్రాంట్ లను విడుదల చేసిందని అన్నారు. కాగ గ్రామ పంచాయతీలకు గ్రాంటు విడుదల చేయగానే ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శీలకు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమాచారం అందిస్తారని తెలిపారు. అలాగే మండల, జిల్లా పరిషత్తులకు కూడా సమాచారం అందిస్తారని మంత్రి తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల నిధుల విడుదలల పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు.