మంత్రి కేటీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ టీఎస్పీఎస్సీ పీఆర్వో గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరికి తెలియని సమాచారం కేటీఆర్ దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు టీఎస్పీఎస్సీ లో ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులు ఎవరో జనార్థన్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరుద్యోగుల పక్షాన ఉంటారో..దొంగల పక్కన ఉంటారో తేల్చుకోవాలన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా..పేపర్ లీకేజీపై కొట్లాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి లాంటి కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని విద్యార్థులు,నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం చేస్తే కేయూ విద్యార్థులపై అన్యాయంగా కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పేపర్ లీకేజీకి సంబంధించిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో అనేక ప్రశ్నాపత్రాలు దొరికాయన్నారు. మరికొందరు నిందితుల ఇళ్లల్లో ప్రశ్నాపత్రాలతో పాటు జవాబులు కూడా దొరికాయని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా మళ్లీ పరీక్షలు పెడతామని కమిషన్ చైర్మెన్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని..దీనిపై .ముఖ్యమంత్రి వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి గవర్నర్ కు నివేదించాలని డిమాండ్ చేశారు. కమిషన్ సభ్యులు వెంటనే తప్పు ఒప్పుకొని గన్ పార్క్ వద్ద క్షమాపణ కోరి సిట్ అధికారులకు లొంగిపోవాలన్నారు.