ఉక్రెయిన్‌పై 10 నెలలుగా దండయాత్ర సాగిస్తోన్న రష్యా సోమవారం తొలిసారి కీలక ప్రకటన చేసింది. దక్షిణ రష్యా ప్రాంతంలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో నాలుగు క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసినట్లు వెల్లడించింది. ఈ క్షిపణులు అమెరికాలో తయారైనట్లు తెలిపింది. బెల్‌గొరాడ్ ప్రాంతంలో గగనతలంలోకి దూసుకొచ్చిన నాలుగు అమెరికన్ ‘హెచ్‌ఏఆర్‌ఎం’ యాంటీ రాడార్ క్షిపణులను కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ సోమవారం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నగరంపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేస్తున్నట్లు రష్యా కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఆదివారం కూడా ఈ నగరంపై కీవ్ సేనలు దాడి చేసినట్లు బెల్‌గొరాడ్ ప్రాంత గవర్నర్ ఆరోపించారు.
రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా ఆయుధ సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై మళ్లీ దూకుడు పెంచిన రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై రాకెట్లు, బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ పైన డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడులతో ఇటీవల ఖేర్సన్ నుంచి వెనక్కి వెళ్లిపోయిన మాస్కో.. తాజాగా ఆ నగరంపై విరుచుకుపడింది. ఆదివారం ఒక్కరోజే 54 దాడులకు పాల్పడింది.