ఉక్రెయిన్ – రష్యా వార్ మధ్య వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. దీంతో భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం ‘ ఆపరేషన్ గంగ’ పేరుతో వీరిందరిని ఇండియాకు సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మూడు విమానాలు రోమేనియా, హంగరీ నుంచి భారత్ చేరుకున్నాయి. మరో విమానం కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఉక్రెయిన్ దేశానికి సరిహద్దుల్లో ఉన్న హంగేరీ, రోమేనియా, పోలాండ్ దేశాల ద్వారా భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుతున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుండి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎటువంటి వీసా లేకుండా పోలాండ్‌లోకి ప్రవేశించడానికి పోలాండ్ అనుమతిస్తోందని భారతదేశంలోని పోలాండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ వెల్లడించారు. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశాల్లోని భారతీయ ఎంబసీలు ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది భారతీయులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరందరిని దశలవారీగా ఇండియాకు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తోంది భారత ప్రభుత్వం.