తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ పథకం కింద 62.37 లక్షల మంది రైతులు లబ్ధి పొందనుండగా.. బ్యాంకు వివరాలు అప్‌డేట్ కాకపోవడం, చనిపోయిన రైతు యొక్క పట్టా కుటుంబ సభ్యుల పేరు మీదకి మార్పిడి జరగకపోవడం వంటి కారణాలతో కొందరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం. ఆ సంఖ్య దాదాపు రెండున్నర లక్షలుగా ఉన్నట్లు తెలుస్తుంది.
అధికారిక సమాచారం మేరకు ఒక కోటి 51 లక్షల ఎకరాల భూమికి 62.27 లక్షల మంది పట్టాదారులున్నారు. మొత్తంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, చనిపోయిన రైతుల వివరాలను తీసేయగా 61.49 లక్షల మంది రైతులు రైతు బంధుకు అర్హులవుతారని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. కాగా 58.93 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు మాత్రమే రైతుబంధు వెబ్‌సైట్‌లో వ్యవసాయ శాఖ ఏవో లు అప్టేడ్ చేసినట్లు తెలియవచ్చింది. ఈ లెక్కన దాదాపుగా 2 లక్షల మంది రైతులకు రైతుబంధు కట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ధరణి రాక మునుపు మ్యుటేషన్ల కోసం ధరఖాస్తు చేసుకున్న రైతుల అప్లికేషన్తు ప్రాసెస్ చెయ్యకపోవడం వల్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకం రాక కొంతమంది అనర్హులుగా మిగిలిపోనున్నారు. చనిపోయిన రైతుల కుటుంబీకులు మ్యుటేషన్ల ప్రాసెస్‌లో జాప్యం, గిఫ్ట్ డీడ్స్, రిజిస్ర్టేషన్చేసుకున్నవి ముటేషన్ కాక నిజమైన అన్నదాతలకు సాయం అందకుండా పోవడం ఆవేదన కలిగిస్తోంది. ప్రతీసారీ కొంత మంది లబ్దిదారులకు రైతుబంధు కట్ చేస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. అసలైన రైతులకు లబ్ధి చేకూర్చడంలో భాగంగానే ఈ కోతలు ఉంటున్నాయని అధికారుల మాట.. రాను రాను రైతు బంధు పథకం కేవలం అర్హులకు మాత్రమే ఇచ్చే విధంగా ఇంకా కఠిన నిబంధనలు అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.