పట్టాలపై ఇనుపరాడ్డు.. శబరి ఎక్స్​ప్రెస్​కు తప్పిన ముప్పు

-

సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌(17230)కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుప రాడ్డును చూసిన లోకోపైలెట్‌ మంజునాథ్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే  రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

రైలు పరిమిత వేగంతో వెళ్తున్నందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండానే రైలును ఆపగలిగారు. ఇంజినీరింగ్‌ సిబ్బంది, సహాయ లోకో పైలెట్‌లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్‌కు చేరింది. దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టడం గమనార్హం. రైలు పట్టాలపై సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఇటువంటి వాటిని గుర్తిస్తుంటారు. వారు ఆ మార్గాన తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దీన్ని అమర్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news