టీడీపీ నాయకులూ సబ్బం హరిని చూసి నేర్చుకోండయ్య!

-

ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. జగన్ తనవద్దకు రానివ్వనివారు.. పరిపూర్ణమైన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలినవారు.. ప్రజల చీత్కారాలను ఎదుర్కొన్నవారు… జగన్ పై తమకున్న అక్కసును టీవీ డిబేట్లలో వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది తమను పార్టీలో చేర్చుకోనివ్వలేదనో, దగ్గరకు రానివ్వలేదనో వెళ్లగక్కే అక్కసుగా మాత్రమే అనుకుంటే పొరపాటే… బాబు వద్ద మార్కులు పొందాలనే తాపత్రయం కూడా ఆ అక్కసులో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి! ఆ మాటలకు బలం చేకూర్చేలా.. ప్రతిపక్షాలకంటే డిఫరెంట్ గా, జగన్ వ్యతిరేకవర్గ మీడియాకంటే అందంగా మాటలు చెబుతున్నారు మాజీ ఎంపీ సబ్బం హరి!

కేవలం టీవీ డిబేట్లలో కనిపించడం వల్ల మాత్రమే గుర్తుపెట్టుకునే, గుర్తింపుతెచ్చుకునే నాయకులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారనేలా వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… తాజగా ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో సబ్బం హరి కొన్ని చేసిన కొన్ని వ్యాఖ్యానాలు.. ఆయన దిగజారుడు తనాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు వైకాపా నేతలు, రాజకీయ విశ్లేషకులు! అందులో ఆయన ముందుగా చెప్పినది… వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల.. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసిన వారిలో 10% మంది దూరమయ్యారని చెప్పుకొచ్చారు సబ్బం హరి. సర్వే చేయించారో ఏమో తెలియదు కానీ.. పక్కాగా ఫిగర్ కూడా చెప్పేశారు.

అనంతరం బాబు భజన స్టార్ట్ చేసిన సబ్బం హరి… ప్రభుత్వ వైఫల్యాలను మూడో నెల నుంచే ఎండగట్టడంతోపాటు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో చంద్రబాబు సఫలీ కృతులయ్యారని పేర్కొన్నారు. అసలు ఏపీలో ప్రతిపక్షం ఉందా లేదా అనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… గత మూడు నాలుగు నెలలుగా ఏపీ ప్రజల కంటికి కూడా కనిపించకుండా తిరుగుతున్న చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయి, షాకయ్యేలా సబ్బం హరి కామెంట్లు చేయడం గమనార్హం.

అక్కడితో ఆగారనుకుంటే పొరపాటే సుమా… పోలవరం గేట్లు పనులు ప్రారంభించండి.. అంటూ సీఎం జగన్ ఆదేశించడంపై కూడా తనదైన ఊహాగాణం చేసిన సబ్బం హరి… గత ప్రభుత్వ హయాంలోనే పోలవరం 70శాతం పని పూర్తయిందని, అవినీతి జరగలేదని, ప్రోగ్రెస్‌ కూడా బాగున్న నేపథ్యంలో ఎందుకు ఆపారని, కేంద్రం అడగడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం చర్యలు ప్రారంభించినట్టుందని అభిప్రాయపడ్డారు.

అప్పుడే అయిపోయిందనుకుంటే పొరపాటే… రాష్ట్ర విభజనకు చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకమని సబ్బం హరి తెలిపారు. బాబుకు కూడా షాకిచ్చేలా ఉన్న ఈ వ్యాఖ్య సబ్బం హరి నోటినుంచి వెలువడింది. ఇంక తెలంగాణలో టీడీపీ ఎలాగూ కనిమరుగైపోయింది కాబట్టి ఈ ధైర్యం చేశారో ఏమో కానీ… రాష్ట్రం విడిపోవాలని – కలిసుండాలని బాబు ఏనాడూ క్లారిటీగా చెప్పలేదు. బంతిని కేంద్రం కోర్టులో వేసేసి… రెండు కళ్ల సిద్ధాంతంతో డబుల్ గేం రాజకీయాలు షురూ చేసిన సంగతి టీడీపీ నేతలే మరిచిపోలేదు. అలాంటిది చంద్రబాబు రాష్ట్రం విడిపోవాలని కోరుకోలేదని సబ్బం హరిలాంటి మాజీ కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తుంటే.. హరి హరీ అనక మానరు ఏపీ ప్రజలు!!

ఏది ఏమైనా, తాజాగా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు విన్నవారు మాత్రం… టీడీపీ నాయకులూ.. సబ్బం హరిని చూసి నేర్చుకోండయ్యా.. టీడీపీ అధినేతపట్ల పట్ల ఈ మాజీ కాంగ్రెస్ నేతకున్న విశ్వాసాన్ని, విశ్వసనీయతను చూడండయ్యా.. మాట్లాడటం అంటే ఇది, బాబు గురించి బాబే షాకయ్యేలా మాట్లాడిన ఆయన రాజకీయానికి శిష్యులుగా చేరండయ్య.. అని ఈ సందర్భంగా పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news