రాహుల్ గాంధీ షోలు ప్లాప్ షో లుగా మారాయి : సత్యవతి రాథోడ్‌

-

తెలంగాణలో ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నారు. జగిత్యాలలో ఓటమి ఖాయం అని తెలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బతుకమ్మ పండగను అవమాన పరిచేవిధంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ షోలు ప్లాప్ షో లుగా మారాయన్నారు. కాంగ్రెస్‌కు అధికారం రావడం కళ అని తెలిసి.. ఆ పార్టీ నేతలు అసహనం తో మాట్లాడుతున్నారన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను అవమానించి నట్టు కాదు.. మొత్తం తెలంగాణ మహిళలనే అవమానించారని మండిపడ్డారు.

Minister Satyavathi Rathod slams Centre over Tribal University issue

బతుకమ్మ పండగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కవితయేనని, బతుకమ్మను మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరం అని, ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ నేతలు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్నెళ్లకు ఒక సీఎంను మార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 2018 లో వచ్చినన్నీ సీట్లు ఇప్పుడు రావు అన్నారు. రాహుల్ గాంధీవి పరిపక్వత లేని మాటలు అన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేశారని కేసులు పెడతారని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల కుంభ కోణంలో రాహుల్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన నీతులు చెబుతారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితానాయక్, కార్పొరేటర్ దేదీప్య తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news