టిక్ టాక్ యాప్‌లో వీడియోలు అశ్లీలంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని మద్రాస్ హైకోర్టు టిక్ టాక్ యాప్‌ను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గూగుల్ కూడా ప్లే స్టోర్ నుండి డిలీట్ చేసింది. అయితే మద్రాస్ హై కోర్టు తాత్కాలికంగానే నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ శాశ్వతంగా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే టిక్ టాక్ యాప్ డెవెలపర్ చైనా కంపెనీ బైటెడెన్స్ టిక్ టాక్ యాప్ నిషేదిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటీషన్లో పేర్కొన్నారు. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వీలైనంత త్వరగా టిక్ టాక్ యాప్ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు సూచించింది. లేని పక్షంలో నిషేదాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.
టిక్ టాక్ యాప్ 54 మిలియన్ల యాక్టివ్ యూజర్లున్నారు. ఇటీవల ఢిల్లీలో ఒక 19 ఏళ్ల బాలుడి హత్య జరిగింది. ఆ సమయంలో అతని స్నేహితులు టిక్ టాక్ యాప్ లో ఈ సంఘటన వీడియోని షూట్ చేస్తున్నారు. టిక్ టాక్ కోసం వీడియో చేస్తూ చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇదే కాకుండా యాప్ లో విభిన్న రకాల అసహ్యకరమైన, అశ్లీల కంటెంట్ పెడుతున్నారని తరచుగా అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. మరి మద్రాస్ హైకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు టిక్ టాక్ యూజర్లు..