కరోనా వైరస్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే మార్చి 31వ తేదీ వరకు ఆ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, సినిమా హాల్స్, మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఒకే చోట పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిబంధనలు మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
తమిళనాడులో కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం రూ.60 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నామని సీఎం పళనిస్వామి తెలిపారు. అలాగే చెన్నై, మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులకు వచ్చే ప్రయాణికులకు అక్కడే కరోనా పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులలో కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని 14 రోజుల పాటు ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సనందించడం జరుగుతుందన్నారు.
ఇక కరోనా వైరస్ నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ విభాగాలు కలిసి పనిచేయాలని పళనిస్వామి ఆదేశించారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు నిత్యం తనకు, ఆరోగ్య శాఖ మంత్రికి రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఇక ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, అవసరం అయితేనే బయటకు రావాలని, మరో 15 రోజుల పాటు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా ఉండాలని సూచించారు.