భక్తులకు గుడ్ న్యూస్… ఈనెల 15 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కోవిడ్ తీవ్రత తగ్గుతుండటంతో పుణ్యక్షేత్రాల్లో ధర్శనాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను ఎత్తేస్తున్నాయి. తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈనెల 15 సోమవారం నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. సోమవారం నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. మండల మకర విళక్కు పండగ సందర్భంగా భక్తులు సందర్శించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. 15న సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో గర్భగుడిని తెరుస్తారు. 16 నుంచి భక్తుల ధర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్ 26న మండల పూజ ముగుస్తుంది. మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2022జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. మళ్లీ అదేనెల 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం రోజుకు 30 వేల మందిని దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే శబరిమలకు వచ్చే వారికి కేరళ ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకుని.. 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారినే శబరిమలకు అనుమతించనున్నారు. దర్శనానికి వెళ్లే వారు తప్పకుండా  తమ ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. యాత్రలో ఎలాంటి ప్లాస్టిక్‌ వస్తువులను అనుమతించరు. ఇక పంపానదిలో స్నానానికి అనుమతి ఉంటుంది కానీ బస చేసేందుకు అనుమతి లేదు. దర్శనం పూర్తైన వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవాలి.