తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు నిన్న ప్రకటించడంతో పాటు.. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానంటూ వెల్లడించారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి పీసీసీ ఇవ్వాలని అడిగారని, వాళ్ళ అన్న వెంకట్ రెడ్డికి పీసీసీ వద్దన్నారని, రేవంత్ రెడ్డి, లేదంటే తనకు ఇవ్వమన్నారన్నారు. నా ఇంటికి వచ్చి రాజగోపాల్ నన్ను ప్రపోజల్ పెట్టాలని అడిగారని, నేనే ప్రత్యక్ష సాక్షిని.. దమ్ముంటే ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడుస్తావా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో ఉండి అమిత్ షాను చాలా కలిశాను అని ఆయనే చెప్పారని, కాంట్రాక్టర్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డికి డిఫాల్టర్ గా కోట్ల అప్పులున్నాయని, వాటి కోసమే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. గెలిచాక మునుగోడు ఏరోజైనా వెళ్లినవా రాజగోపాల్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి ఈరోజు గుర్తుకు వచ్చిందా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ ను విమర్శించే స్థాయి నీకు లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను బొంద పెడతారన్నారు.