సింహం సింగిల్ గానే వస్తుంది… మాకు వైయస్ఆర్ బొమ్మ ఉందని షర్మిలా అన్నారు. వైయస్ఆర్ అనే పేరుంది. వైయస్ఆర్ అనే మూడు అక్షరాలు ఉన్నాయి. వైయస్ఆర్ సంక్షేమ పాలనే మా ఆస్తి. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు చీలుస్తామని హెచ్చరించారు. పేదవాడి పక్షాన నిలుస్తాం. పేదవాడి పక్షాన పోరాటం చేస్తామని.. పేదవాడికి వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తామన్నారు. మేం పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లే మేం పార్టీ పెట్టామని చెప్పారు.
రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనం దోచుకోవడం చూడలేక మేం పార్టీ పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ అట. కేసీఆర్ అట. ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? ఆస్తులు త్యాగాలు చేశారా? బలిదానం చేసుకున్నారా? అని నిలదీశారు. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్ట మర్చిపోయిన చరిత్ర మీదని చురకలు అంటించారు. గడ్డాలు పెంచుకుని దీక్ష చేసింది మీరు. తెలంగాణ సెంటిమెంట్ ను నేటికీ వాడుకుంటున్నది మీరు. ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో పదవులు అనుభవిస్తున్నది మీరు. తెలంగాణ ద్రోహులను అక్కున చేర్చుకుని మంత్రులను చేసింది మీరు అని మండిపడ్డారు. పార్టీ పెట్టాక అనేక పోరాటాలు చేసి, కేసీఆర్ మెడలు వంచిన ఘనత మాది. మీరు మొనగాళ్లు అయితే ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించండని సవాల్ విసిరారు.