కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాల వేళ బరిలో నిలిచిన శశిథరూర్ ఎన్నిక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. థరూర్ బృందం.. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి బుధవారం లేఖ రాసింది.
ఓ వైపు అధ్యక్ష ఎన్నిక ఫలితాల కోసం కౌటింగ్ జరుగుతుండగా శశిథరూర్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సమయంలో తప్పులు జరిగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీని గురించి మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేదు. అందుకే ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో విశ్వసనీయత, సమగ్రత లోపించడం విచారకరం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. ఆ రాష్ట్రంలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికారిక వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా ఎలా జరిగినట్లు అవుతుంది? అందువల్ల ఆ రాష్ట్రంలోని ఓట్లన్నింటినీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ థరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న సల్మాన్ సోజ్ లేఖలో పేర్కొన్నారు.