మరోసారి సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు

-

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 2న రౌత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు ఈడీ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఇవాళ్టితో ముగిసిన రౌత్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా ఈడీ కోర్టు మరోసారి పొడిగించింది.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే తేదీ అయిన నవంబర్ 2 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఈడీ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. పాత్రా వాలా చాల్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. కేసులో పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

అందులో భాగంగానే గత ఆగస్టు 1న ఈడీ సంజయ్‌ రౌత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లు తన కస్టడీలో ఉంచుకుని ఇంటరాగేట్‌ చేసింది. తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. స్పెషల్ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. విచారణ ఇంకా పూర్తి కాలేదన్న ఈడీ అభ్యర్థనలతో కోర్టు సంజయ్ రౌత్‌ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నది. చివరిసారిగా విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియగా మరోసారి కస్టడీని పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news