ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుయాయులు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చన్నా యుడు వంటి వారు ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తరచుగా చెబుతున్న మాట.. ఈ విషయం కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం.. కేంద్రం స్పందించేలా చూస్తాం.. మీ ఆటలుసాగవు.. మీ ఇష్టాలు చెల్లవు.. అంటూ ప్రకటనలు చేస్తు న్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని అమరావతి మార్పు విషయంలోనూ, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో నూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు విషయంలోను.. బాబు అండ్‌కోలు భారీ ఎత్తున ఫైరయ్యారు.
మొత్తానికి జగన్‌పై సమరశంఖాన్ని రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పూరించి ఆయన పరువు, ప్రభుత్వ మర్యా ద కూడా తీసేస్తామంటూ.. టీడీపీ నాయకులు బాకా ఊదారు. అయితే, ఆయా విషయాల్లో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్రం ఎంత వరకు పట్టించుకుందనే విషయం అందరికీ తెలిసిందే. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే ఇష్టమని స్పష్టం చేసింది. అదేసమయంలో ఎన్నికల కమిషనర్ మార్పు విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో ఏం జరిగినా.. కూడా వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం, ప్రభుత్వాన్ని బెదిరించడం టీడీపీకి షరా మామూలే.. అన్నట్టుగా మారింది.
ఇక, ఇప్పుడు మరో కీలక విషయం తెరమీదకి వచ్చింది. తాజాగా లాక్‌డౌన్ మూడో దశ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను ప్రభుత్వం అనుమతించింది. కంటైన్‌మెంట్ జోన్‌లు మినహా.. మిగిలిన చోట్ల మద్యం అమ్మకాలను షురూ చేసింది. ఇక, 25శాతం మద్యం ధరలు కూడా పెంచింది. అయినా జనాలు ఎగబడ్డారు. క్యూలు కట్టారు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. కుటుంబ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు అండ్ కో.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. నీకు ప్రజారోగ్యం ముఖ్యమా.. ప్రజల డబ్బు ముఖ్యమా అంటూ.. బాబు కడిగేశారు. అయితే, ఆయన గతంలో మాదిరిగా ఈ విషయంపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. లేఖలు రాస్తాం. అని మాత్రం అనలేదు.
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటి ఏం జరిగినా బాబు.. ఫిర్యాదు చేస్తామని అంటారు కదా.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు ఏంటని అందరూ అనుకున్నారు. దీనికికారణం.. మద్యం షాపులు తెరవండి.. అంటూ .. కేంద్రమే రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈవిషయంపై ఫిర్యాదు చేసి ప్రయోజనం ఏంటి? అనుకున్నారు బాబు. ఇక, మద్యం ధరల పెంపుపై ఫిర్యాదు చేద్దామంటే.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఉండే ఢిల్లీలోనే 70 శాతం ధరలు నిన్నటి నుంచి పెంచారు. మొత్తంగా చూస్తే.. ఈ విషయంలో బాబు అండ్ కోలు అందుకే తేలుకుట్టిన నాయకుల్లా సైలెంట్ అయిపోయారని అంటున్నారు పరిశీలకులు.